Chemistry Love కెమిస్ట్రీ లవ్ (ఒక ప్రేమకథ)

రచన:- గురుమంచి రాజేంద్రశర్మ Chemistry Love నా జీవితంలో నాకు వచ్చిన మూడవ ప్రేమలేఖ ఇది. వారం క్రితం ‘విరించి’ నా ఫ్రెండ్ నిత్య ద్వారా పంపాడు దీన్ని.

నిత్య నా చేతికివ్వకముందే ఉత్సాహంతో తెరిచి చదివింది.
చదివాక చాలా చాలా ఆశ్చర్యపోవడమే కాదు..”ఇలాంటి ప్రేమలేఖ చదవడం నా జీవితంలో ఇదే మొదటిసారి!!!..ఇలా కూడా రాస్తారా?ప్రేమలేఖలు!!”అంది.

ప్రేమలేఖ తీసుకున్న నుంచి ఇప్పటివరకు ఎన్నిసార్లు చదివానో దీన్ని!!..

అక్కడక్కడ కొన్ని మాటలు తప్ప..ఏమీ అర్థం కాలేదు!
పోనీ పక్కన పడేద్దామా?..అంటే వచ్చింది విరించి నుంచి..

నిత్య కూడా అదే అంది..

“సంహితా! నాకైతే అర్థం కాలేదే!!..పోనీ కొట్టిపడేద్దామా?అంటే ఇచ్చిన వ్యక్తి డాక్టర్ డేవిడ్ వద్ద జూనియర్లుగా పనిచేసే రీసెర్చ్ బ్యాచ్ లోనే జీనియస్ అని పేరు పొందిన విరించి.

నువ్వేమో డాక్టర్ థామస్ వద్ద పనిచేసే మన రీసెర్చ్ బ్యాచ్ లోనే జీనియస్ వి.

బహుశా తనకు తగినజోడివా ?కాదా?..అనే చిన్న పరీక్ష పెట్టాడేమో! నీకు..

ఆ ప్రేమలేఖని తొందరగా అర్థం చేసుకుని రిప్లై ఇవ్వు!!”అంటూ నన్ను ఛాలెంజ్ చేసినట్లుగా అంది.

నేను అమెరికాకు వచ్చి ఐదు సంవత్సరాలు కావస్తోంది.

నేను కెమిస్ట్రీ డిపార్ట్మెంట్ లో రీసర్జ్ స్కాలర్ గా ప్రఖ్యాత సీనియర్ సైంటిస్ట్ అయిన డాక్టర్ థామస్ మేడమ్ క్రింద పరిశోధనలో పనిచేస్తుంటే…

విరించి థామస్ మేడమ్ భర్త అయిన.. డాక్టర్ డేవిడ్ సార్ వద్ద నాలాగే పనిచేస్తుంటాడు.

ల్యాబ్ ఒకే బిల్డింగ్ లో కాబట్టి కనిపించినప్పుడు “హాయ్” అంటూ విష్ చేసుకోవడం..వంటి మాములు పరిచయమే తప్ప దగ్గరి పరిచయం లేదు నాకు విరించితో…

అతను నిత్యతో ప్రేమలేఖ పంపిన నాటి నుంచి..

రాత్రి ల్యాబ్ నుండి వచ్చాక రోజూ కాసేపు ఆ లేఖ చదువుతూ కుస్తీ పడుతూనే ఉన్నాను..అయినా అర్థం కాలేదు.

రీసర్జ్ రిపోర్ట్ పనిఒత్తిడి వల్ల పూర్తిగా దృష్టిపెట్టడం కుదరలేదు.

ఈరోజు ఆదివారం..సెలవు.

నిద్రలేచి ఫ్రెషప్ అయ్యాక..
ఫోన్లో “వుండర్ లిస్ట్” అనే ఆప్ ఓపెన్ చేసాను..
ఈనాటి ప్రోగ్రామ్స్ ఎమున్నాయా? అని చూశాను.

చాలా సౌకర్యంగా ఉంటుందని నేను చేయవలసిన పనులన్నీ ఈ ఆప్ లో నోట్ చేసుకుంటూ ఉంటాను!

లిస్ట్ చూస్తే..

1. ఇంటికి ఫోన్ చేసి మాట్లాడడం..

2. విరించి పంపిన ప్రేమలేఖను అర్థం చేసుకుని ఏదో ఒక రిప్లై ఇవ్వడం

3. ప్రాచీన భారతదేశంలో కెమిస్ట్రీ పైన ఉన్న పుస్తకాలు..పరిశోధనల గూర్చి సెర్చ్ చెయ్యడం

4. సాయంత్రం 7pm కి.. మేడమ్ థామస్ కొడుకు బర్త్ డే పార్టీకి అటెండ్ కావడం.

……ఈ నాలుగుపనులు పూర్తి చెయ్యాలని పెట్టుకున్నాను ఈరోజు!!

మొదట ఇంటికి ఫోన్ చేసి అమ్మానాన్నలతో..తమ్మునితో మాట్లాడాను.

తర్వాత విరించి పంపించిన అర్థంకాని ఈ ప్రేమలేఖను ముందు పెట్టుకుని ఎలాగైనా దీని అంతుచూసి అర్థం చేసుకుందామని కూర్చున్నాను.

మరోసారి చదివాను ఆ ప్రేమలేఖని…

డియర్ “సల్ఫర్, అమెరీషియం, హైడ్రోజన్,అయోడిన్,టాంటాలం” మిశ్రమమా!!

నీలోని “కాపర్, టెలిరియం మిశ్రమాన్ని” చూసి ఎప్పుడూ కెమిస్ట్రీ రీసర్జ్ పిచ్చిలోనే ఉండే నా మనస్సు చలించిపోయింది!!

కేవలం అదొక్కటే కాదు సుమా!

నీలో “టంగ్ స్టన్-తిరిగిపోయిన టైటానియం మిశ్రమాన్ని” కూడా చూశాను.. చూశాక నా మనసు పరవశించిపోయింది!

అందుకే ఆగలేక మన కెమిస్ట్రీ బాగా కుదిరి మన ప్రేమ ఫలించి ఒక్కటవ్వాలని నేను ప్రేమించే కెమిస్ట్రీలో ఈ ప్రేమలేఖ రాస్తున్నాను!!

…….అంటూ ప్రారంభమయ్యింది!అతని ప్రేమలేఖ!!

చీ!ఎంత కెమిస్ట్రీ డిపార్ట్మెంట్ లో ఉంటే మాత్రం అదేం సంబోధన??!!

నాలో ఏవేవో మూలకాల మిశ్రమాన్ని చూశాడట!!

రోజంతా ల్యాబ్ లో ఈ మూలకాలను చూసి చూసి నాలో కూడా అవ్వే కనిపిస్తున్నాయంటే.. ఏమన్నా కాలేదు కదా!..ఈ విరించికి!!

చిన్నప్పుడు నాక్కూడా చెస్ నేర్చుకున్న కొత్తలో కొన్నిరోజులు విపరీతంగా ఫ్రెండ్స్ తో చెస్ ఆడి ఆడి నిద్రలో కూడా చెస్ ఆటలోని పెద్ద పెద్ద ఏనుగులు.. గుర్రాలు..ఒంటెలు..భటులు..పెద్ద పెద్ద నలుపుతెలుపు గడులు.. కనిపించేవి!

అలాగే ఈ విరించికి కూడా ఏం కాలేదు కదా!..

చా!!కాదు..
ఈ ప్రేమలేఖలో ఏదో లాజిక్ ఉంది!..అదే తెలియడం లేదు!!.

విరించి కాకుండా మరెవరన్నా ఈ ప్రేమలేఖ రాస్తే ఇంత టైంవేస్ట్ చేసుకొని ఆలోచించేదాన్నే కాదు!

విరించి గురించి నిత్య ఏమేమో చెప్పింది!
ఇప్పటివరకు ఈ విరించికి ఎంతమంది అమ్మాయిలు ప్రపోజ్ చేసినా ఎక్సెప్ట్ చేయలేదట!
ఫ్రెండ్ గా ఉందాం!..కానీ ఈ లవ్ లు నాకు ఇంట్రెస్ట్ లేదు..ప్రస్తుతం నా దృష్టంతా నా రీసర్జ్ & కెరీర్ మీదే ఉందని చెప్పేవాడట!

నిత్య చెప్పిన మాటల వల్ల నాక్కూడా కొంచెం ఇంట్రెస్ట్ పెరిగింది విరించిపై…

కాకపోతే..

చిన్నప్పుడే ప్రేమమీద నాకు కొన్ని అభిప్రాయాలు ఏర్పడ్డాయి!..అప్పటి నుంచి కొన్ని భావాలను మోస్తూ వస్తున్నాను!”మోస్తూ” అని ఎందుకంటున్నానంటే.. అవి నిజమైతాయో? లేదో?? నాకు తెలియదు మరి!!

…ఒకరకంగా ఈ భావాల వల్లే నాకు వచ్చిన మొదటి రెండు ప్రేమలేఖలు చెల్లకుండా పొయ్యాయి!

ప్రేమమీద నా అభిప్రాయాలకు కారణమైన ఆ రోజు నా కళ్ళముందు మెదిలింది.

**********************

పదోతరగతిలో ఉన్నప్పుడనుకుంటా! వినాయక చవితి ఉత్సవాల సందర్భంగా జరిగే హరికథకు.. “నేను రాను మొర్రో”..అంటున్నా వినకుండా “ఈ హరిదాసు మంచి మంచి విషయాలు చెబుతుంటాడే!విందువుగాని రా!!”అంటూ మా అమ్మమ్మ బలవంతంగా నన్ను తోడుతీసుకెళ్లింది.

స్కూలు కెళ్లినట్లు ఒక నోట్ బుక్,పెన్ను తెచ్చుకుంటున్న అమ్మమ్మని చూసి నేను పరిహాసం చేస్తుంటే..నేను విన్న,చదివిన మంచి విషయాలన్నీ ఇలా నోట్బుక్ లలో రాసుకుంటానే!!ఖాళీ ఉన్నప్పుడల్లా మళ్ళీ చదువుకుంటాను! నేను పోయాక నీకు ఉపయోగపడతాయిలే ఇవి!!అంది.

అమ్మమ్మ ఏ క్షణంలో అందో కానీ.. ఆవిడ పోయాక ఆ నోట్బుక్ లన్ని నేనే తెచ్చుకున్నాను!
అప్పుడప్పుడు చదువుతుంటాను!
నాకెంతో నేర్పాయి అవి!

ఆరోజు అమ్మమ్మతో నేను వెళ్లిన నాటి విషయాలు కూడా రాసుకుంది!..నేను కూడా ఉండడం వల్ల..ఆనాటి విషయాలు అమ్మమ్మ నోట్బుక్ లో చదవడం వల్ల ఆ రోజు ఇంకా నాకు సజీవ దృశ్యంగానే వుంది!!

ఆ రోజు “రాధామాధవ విలాసం” అనే హరికథ.

ఆ హరికథ ప్రారంభమైన కాసేపటి తర్వాత బోర్ కొట్టి అమ్మమ్మ తొడపై తలపెట్టి పడుకుందాం!..అంటూ అనుకుంటున్న సమయంలో ఆ హరిదాసు ప్రేమ విషయం తీసి ఆసక్తికరంగా చెప్పసాగాడు. ఏం చెబుతాడా? అని పడుకునేదాన్ని మళ్ళీ లేచి కూర్చున్నాను!

ఆ హరిదాసు శృతిలయలు తెలిసినవాడు కాబట్టి మాటల్లో భావాన్ని లయబద్దంగా ఒలికిస్తూ హృదయంలోకి చొచ్చుకుపోయ్యేలా మాట్లాడుతున్నాడు!!

“ఎందుకో అలంకారికులు నవరసాల్లో చోటు కల్పించలేదు కానీ..ప్రేమ కూడా రసమే!!” అన్నాడు ముందుగా!

” ఈ అలంకారికులు ప్రేమను ఎందుకు నిర్లక్ష్యం చేసి నవరసాల్లో ఒకటిగా స్వీకరించలేదో అర్థం కాదు!”..అంటూ వాపోతూ..
“నిజానికి అన్ని రసాల కన్నా మనిషిని ఎక్కువగా ఆకర్షించేది ఈ ప్రేమ రసమే” అన్నాడు.

నాక్కూడా నిజమే అనిపించింది!

ఎందుకంటే..

“ఈ ప్రేమ విషయం వచ్చేసరికి నా నిద్రమత్తు,బోర్ ఎగిరిపోయి కూచున్నా కదా!!”అనుకున్నాను!

తర్వాత అతను ఈ ప్రేమరసాన్ని వివరిస్తూ..

ప్రతీరసానికి వాటి వాటి స్థాయిభావాలు ఉంటాయి..

శృంగార రసానికి.. రతి
వీర రసానికి.. ఉత్సాహం
కరుణ రసానికి..దుఃఖం
..ఇలా అన్నిరసాలకు చెబుతూ

ప్రేమ రసానికి స్థాయి భావం “ఆనందమే” అన్నాడు..

ఒక విషయాన్ని చూసి గాని..చదివిగాని.. మనస్సు స్పందిస్తే..మనలో ఆ రససిద్ధి కలుగుతుందట!
అప్పుడు ఈ స్థాయిభావం మనలో ఏర్పడుతుందట!

కొన్ని ఉదాహరణలు కూడా చెప్పాడు

ఒక సినిమాలో..లేదా నాటకంలో కథానాయకుడు వీరత్వాన్ని ప్రదర్శిస్తే మనలో ఉత్సాహం కలుగుతుందట!

అలాగే కరుణా సన్నివేశాలు బాగా పండితే.. దుఃఖం కలుగుతుందట!

హాస్యరస సన్నివేశాలుతో..నవ్వు

భీభత్స సన్నివేశాలతో..జుగుప్సా

ఇలా ప్రేమరసంవల్ల కలిగేది..ఆనందం అన్నాడతను.

తర్వాత అతడు చెప్పిన విషయాలు విని..
“అమ్మమ్మతో రాకపోయి వుంటే చాలా మిస్ అయ్యేదాన్ని!!”..అంటూ అనుకున్నాను ఆరోజు.

ఆ హరిదాసు ప్రేమ గూర్చి ఎంత అద్భుతంగా వివరించి చెప్పాడంటే…

ఇప్పటికీ అతడు చెప్పిన విషయాలు నా మనస్సులో తిరుగుంటాయి!

ప్రేమతో నిండిపోయినపుడు ఏం జరుగుతుందో వివరించాడతను!! ఆ స్టెప్స్ ను కొన్ని సంస్కృత పదాలతో వివరించాడు ఆ హరిదాసు!

ప్రేమించినవ్యక్తిపై మొదట “ప్రీతి” కలుగుతుందట!

ప్రీతి అంటే ఇష్టం..అని అర్థం చెబుతూ..
ఆ ఇష్టపడిన వ్యక్తికోసం ఎంత కష్టమైనా ఓర్చుకుంటారట!
“నిజానికి అది కష్టమే అనిపించదు ఆ సమయంలో”.. అంటూ కొన్ని ఉదాహరణలు చెప్పాడు!

తాను బాగా ఇష్టపడే హీరోసినిమాకి ఒక కుర్రాడు ఎంత కష్టమైనా లైన్లలో నిలబడి టికెట్టు కొనుక్కుంటాడు!..
వాడికి అది కష్టం అనిపిస్తుందా?

ఆ సమయంలో..
వాడి దృష్టి అంతా తాను ఇష్టంగా చూడబోయే తన హీరోసినిమా మీదే ఉంటుంది!

అలాగే ఇంట్లో కొన్ని పనులకే విసుగు చెందుతుండే కుర్రాళ్ళు ఎంత కష్టమైనా గంటల తరబడి క్రికెట్టు ఆడుతారు!..ఎందుకంటే అది వారికిష్టం కనుక!!అలా ఆడుతున్నప్పుడు శరీరానికి శ్రమ కలిగినా..చివరకు దెబ్బలే తాకినా కష్టం అనిపించక పోగా ఆనందమే కలుగుతుంది!

అలాగే ప్రేమించిన వ్యక్తి పట్ల కూడా అదే ఇష్టంతో ఎంత కష్టమైన భరిస్తారు!”..అంటూ చెప్పాడు.

..అప్పుడు ఆ హరిదాసు ఈ విషయాలు చెబుతుండగా నేను వింటున్న దృశ్యం గుర్తొస్తే నవ్వొస్తుంది..

అప్పుడే నాలో వయస్సు మొగ్గతొడుగుతున్న రోజులవి!

అతను ఈ ప్రేమ ప్రభావాన్ని చెబుతుంటే ఇట్లా నిటారుగా కూర్చొని నోరెళ్ల బెట్టి ఆశ్చర్యంగా వింటుండిపోయాను ఆ రోజు!!

తర్వాతి రెండో స్టెప్ “సమ్మానం” అన్నాడు.

సమ్మానం అంటే గౌరవం ఆట!

“ప్రేమ అనే పుష్పం వికసిస్తే వచ్చే పరిమళమే గౌరవం”అన్నాడు.

అతను మరొకమాట చెప్పాడు

“ఎంత నటించినా నిజానికి మనం ఇష్టపడని వ్యక్తిని ఎప్పటికీ గౌరవించలేము!”..అంటూ!!

ప్రేమించిన వ్యక్తి పట్ల ఇష్టంతో పాటు గౌరవం కూడా కలుగుతుంది.. అంటూ చెప్పాడు.

మూడవ స్టెప్”అప్రాతికూల్యం”అన్నాడు.

అంటే ప్రేమించే వ్యక్తి పట్ల వ్యతిరేకంగా ఒక్క మాటకానీ,ఆలోచనకానీ,పనికానీ ఉండవట..

అసలు మనసు ఆ వ్యక్తి గూర్చి కొంచెం కూడా వ్యతిరేకంగా ఆలోచించదట!..ఇంకా మాటలూ.. చర్యలు ఎలా ఉంటాయని” ప్రశ్నించాడు.

నాలుగవ స్టెప్ “సంతతం”అన్నాడు.

అంటే.. ఆ ప్రేమను ఒక సంతతధారగా..ఎడతెరపి లేకుండా నిరంతరం ప్రేమించేవ్యక్తిపై కురుపిస్తూనే ఉంటారట!

ఐదవ స్టెప్ “నభయం”అన్నాడు.

అంటే..ప్రేమించే వ్యక్తి పట్ల కొంచెం కూడా భయం ఉండదట!
పైగా ఆ వ్యక్తి తనకున్నాడనే ధైర్యమే ఆత్మవిశ్వాసానికి తోడై మరింత పరిపుష్టిని కలిగిస్తుందట!

ఆరవ స్టెప్ “నఫలాపేక్షకం” అన్నాడు.

“ప్రేమ ఎప్పుడూ ప్రతిఫలాన్ని కోరదు!”..”ఒక తల్లిలాగా ఏమీ ఆశించకుండా ఇచ్చేదే ప్రేమ!!”అన్నాడు.

ఒకవేళ ప్రతిఫలం కోరుకుంటే అది వ్యాపారం అవుతుంది కానీ..ప్రేమ ఎలా అవుతుంది??..అంటూ ప్రశ్నించాడు!

ఏడవ స్టెప్ “విరహం”అంటూ చెప్పాడు.

ఈ స్థితిలో ప్రేమించినవ్యక్తి దూరంగా వుంటే మళ్ళీ కనిపించేవరకు విరహవేదన ఉంటుందట!

ఈ విరహవేదనలో ప్రేమించిన వ్యక్తి గూర్చిన ఆలోచనల ధ్యానమే ఉంటుందట!

అన్ని వేదనల్లోనూ ఇష్టమైన వేదన ఏమిటో తెలుసా!
ఈ విరహవేదననే!!…
ఈ విరహవేదన చాలా పెద్ద బాధనే..కానీ అది ఇష్టమైన బాధ !!…అంటూ వివరించాడు!

ఎనిమిదవ స్టెప్ ను “తదర్థ శరీర సంస్థానం” అన్నాడు

అంటే ఆ ప్రేమించిన వ్యక్తి కోసమే ప్రాణాలు నిలిచి ఉన్నాయనే అనుభూతి పొందుతారట!!..

చివరిదైన తొమ్మిదవ స్టెప్ ను”తదీయం” అన్నాడు.

Pages: 1 2 3 4