ఇక్కడ అహం పూర్తిగా శూన్యమై “నాది అనేది ఏదీ లేదు అంతా నువ్వే!!” అంటూ ఒక మంచుగడ్డ కరిగి సముద్రంలో లీనమైనట్లు మొత్తం ప్రేమించిన వ్యక్తి ఫీలింగ్ తోనే ఉంటారట!

ఇలాగే…రాధ కూడా మాధవుని ప్రేమించింది!..కామించింది!
అతనికోసం..ఆరాటపడింది!..ఆక్రోశపడింది!..అలమటించింది!!..ఆవేశపడింది!!..అనునయించింది!..అనుభూతి చెందింది!..చివరికి అతనితోనే పూర్తిగా నిండిపోయి అతనిగానే మారిపోయింది!!

ఒకదశలో కృష్ణుని పొందలేకపోయితినే అనే విరహవేదనవల్ల పొందిన మహాదుఖం ఆమె పాపాలను నశింపజేసిందట!

శ్రీకృష్ణుని భావాలు మనస్సులో నిండగా పొందిన అనంత ఆనందం వల్ల ఆమె పుణ్యం కూడా పూర్తిగా ఖర్చు చెయ్యబడిందట!

..ఇలా ఆమె పుణ్యపాపలు తొలగి ముక్తురాలు అయ్యిందట!!

..నిజానికి ఈ ప్రేమనే భగవంతుని పైకి మరల్చితే అదే భక్తి అవుతుంది!

ప్రేమ..భక్తి ఒకే స్వరూపం.

ఈ ప్రేమించే వ్యక్తికి ఏర్పడే మొట్టమొదటి అర్హత ఏమిటో తెలుసా?

“నిగ్రహం”

అంటే…ప్రేమించేవ్యక్తి కోసం ఏ సుఖాన్నైనా త్యాగం చేయగలిగే మానసిక ధృతి.

…ఇదిగో ఇక్కడివరకే నాకు గుర్తుంది!!

నన్ను ప్రేమించానని ఎవరన్నా చెబితే వారికి ఈ నిగ్రహం పరీక్ష పెట్టాలి!..అని ఆ హరికథ వింటూ ఆ 15 ఏళ్ల వయస్సులో నిశ్చయించుకున్నాను!

అప్పుడు ఎంత గట్టిగా ముద్రపడిందో కానీ,వదిలించికుందామని ఎంత ప్రయత్నించినా నాలో ఈ భావం..ఈ పరీక్ష పట్ల పట్టుదల పోవడం లేదు!

అందుకే అన్నాను ఈ భావాన్ని మోస్తూ ఉన్నానని!!

పాపం!!ఇలా నేను ఈ నిగ్రహపరీక్షలు పెట్టడం వల్లనే నాకు మొదట వచ్చిన రెండు ప్రేమలేఖలు చెల్లకుండా పొయ్యాయి!!

కెమిస్ట్రీ లవ్ అంటూ మొదలుపెట్టి ఇలా హరికథ చెప్పడం మీకు ఒకరకమైన విసుగును తెప్పించడం లేదా?

మీలాగే నా పరిస్థితి కూడా వుంది!!నా భావాన్ని మోస్తూ!!

నిజంగా ప్రేమించేవ్యక్తిని అన్వేషించాలని ఒకవైపు..
మరోవైపు ఇదిఅసలు జరిగే అవకాశం ఉందా?
నా భావంలో ఏమైనా సారం వుందా? అనే సందేహం మరోవైపు!!

*********************

నేను డిగ్రీ సెకండ్ ఇయర్ ఉన్నప్పుడు అనుకుంటాను..ఒకబ్బాయి నాకు మొదటి ప్రేమలేఖ రాశాడు!

ఒక కవితలా రాసి..చివరకు “సంహితా! ఐ లవ్ యూ!!” అంటూ..

నేను అతని గురించి ఎంక్వైరీ చేశాను! అతనికి “పాన్ పరాగ్ గుట్కా” అలవాటు ఉందని తెలిసింది!

అతడు కలిసినప్పుడు”ప్రేమించేవ్యక్తి కోసం ఏ సుఖాన్నైనా త్యాగం చేయగలవా నువ్వు!” అంటూ అడిగాను!

అతను ఒక్క క్షణం వీస్తుపోయి “సంహితా!నీకోసం ఏమైనా చేస్తాను నేను!!”అన్నాడు.

అయితే ‘పాన్ పరాగ్ గుట్కా’అలవాటు మానేయ్!..అప్పుడు నా ప్రేమ విషయం ఆలోచిస్తాను! అన్నాను.

సరే అంటూ వెళ్ళాడు…
కానీ, అతను ‘పాన్ పరాగ్ గుట్కా’వదిలిపెట్టలేదు…నా మీదున్న ప్రేమని వదిలిపెట్టాడు!!

తర్వాత డిగ్రీ ఫైనల్ ఇయర్ లో మరో అబ్బాయి ప్రేమలేఖ రాశాడు!

నా అందాన్ని పొగుడుతూ రాస్తూ..”నువ్వు లేకుండా నేను బ్రతకలేను! ఐ లవ్ యూ! నువ్వు ఒప్పుకోకుంటే మరోసారి నా రక్తంతో రాస్తాను ప్రేమలేఖ!!”అంటూ రాశాడు!

రక్తంతో రాయడం ఎందుకు??
నేనెందుకు ఒప్పుకోను?..
పైగా నాక్కావాలసిందే ఇది!!
నిజానికి అప్పుడు నా స్థితి ఎలా ఉంది అంటే..
ఎంత మంది నన్ను ప్రేమిస్తే అంత మంచిది!
అందరికి ఈ నిగ్రహ పరీక్షలు పెట్టవచ్చు!..అనుకుంటూ ఉబలాటపడేదాన్ని!

కానీ దురదృష్టవశాత్తు నాకప్పుడు రెండు మాత్రమే వచ్చాయి

ఈ రెండో ప్రేమలేఖ చూసి చాలా సంతోషించాను..మరో పరీక్ష పెట్టే అవకాశం వచ్చినందుకు!!

ఏం పెట్టాలా?.. అని ఆలోచించాను.
నేనప్పుడు తెల్లవారుజామున 5 గంటకు యోగ క్లాసులకు వెళుతున్నాను..రమ్మంటే?.. అని ఆలోచించాను..
నాతో కలవచ్చు.. మాట్లాడొచ్చు..బయటకు తీసుకెళ్ళొచ్చు!!.. అనుకుని వస్తాడేమో! ఎక్జామ్స్ ముందు డిస్టపెన్స్ ఎందుకు? ఇది కూడా పెడుదాం!అనుకుని..

అతను కలిసినప్పుడు అతనికి కూడా నా ప్రేమ పరీక్ష విషయం చెప్పి “ప్రతీరోజూ 5am కు నేను వెళ్లే ఈ యోగా క్లాసులకు రా!..ఒక 6 నెలల వరకు మన ఎక్జామ్స్ అయ్యే వరకు నాతో మాటకూడా మాట్లాడవద్దు!!”..అంటూ చెప్పాను.

ఒక నెల రోజులు వచ్చాడు..నవంబర్ చలికాలం ప్రారంభం కాగానే మానేశాడు!..

మా యోగా మాస్టారు బాగా కఠినాత్ముడు!!
పాపం!ఒళ్ళంతా హూనం అయ్యేలా యోగాసనాలు..సూర్యనమస్కారాలు చేయిస్తుంటాడు.. పోనీ.. ప్రియురాలుతో మాట్లాడుదాం!..కాస్తా సినిమాలో..పార్కులో అంటే అదీ లేదు!
అతనికి ఏం ఎంజాయ్ మెంట్ ఉంటుంది?…

అందుకే తర్వాత వాళ్ళ ప్రక్కింటి అమ్మాయికి రక్తంతో ప్రేమలేఖ రాసి లవ్ లో పడ్డట్టు తెలిసింది!!

మళ్ళీ ఇంతకాలానికి ఈ మూడో ప్రేమలేఖ వచ్చింది..

అప్పటికీ ఇప్పటికీ అన్ని విషయాల్లోనూ నాలో కాస్తా జ్ఞానం పెరిగిందనే అనుకుంటాను!..కానీ ఆ 15 ఏళ్ల వయస్సులో పడ్డ ఆ అభిప్రాయం మాత్రం పోలేదు!..

అందుకే ఫ్రాయిడ్ అంటాడేమో! బాల్యంలో పడిన ముద్రాలూ,జ్ఞాపకాలు చాలా బలంగా ఉంటాయని!!!

వేరేవాళ్ళు ఎవ్వరైనా విరించి రూపం,జ్ఞానం,పొజిషన్ చూసి కళ్ళుమూసుకుని ఒప్పేసుకుంటారు!
నాకు మాత్రం అతనికి కూడా ఒక పరీక్ష పెట్టాలనే ఉబలాటమే ఉంది.

కానీ, అతనే నాకు ఈ ప్రేమలేఖను ఇలా ఎలిమెంట్స్ తో (మూలకాలతో)నింపి పరీక్ష పెట్టాడు..

మళ్ళీ మళ్ళీ చదివాను!! ఆ ప్రేమలేఖని!!!..వచ్చిన ఈ మూడవ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని అతనికి కూడా ‘నిగ్రహపరీక్ష’ పెట్టాలనే నా కోరిక నెరవేరేలా లేదు!

ఆ ప్రేమలేఖ అర్థం కావడం లేదు!
ఇలా అయితే ఈరోజంతా వృథాగా గడిచిపోయ్యేలా వుంది అనుకొని..దీని విషయం మళ్ళీ చూద్దామని.. ఈరోజు చేద్దామనుకున్న మూడవపని ముందర వేసుకున్నాను!

ప్రాచీన భారతదేశంలో రసాయన శాస్త్రం గురించి..

ఇంటర్ నెట్ లో సెర్చ్ చేస్తే తెలిసిన విషయాలు ఇవి!

మొదట ఋగ్వేదంలో అణు ప్రసక్తి వచ్చిందట!

మంత్రపుష్పంలో ఆత్మ ఎలా ఉంటుంది? ఎక్కడ ఉంటుంది? అన్న ప్రశ్నలకి సమాధానం చెబుతూ ఋగ్వేదంలో ఉన్న మంత్రపుష్పంలో “నీవారశూకవత్తన్వీ పీతాభాస్వత్యణూపమా” అని ఉందట!. ఇది ఋగ్వేదంలో ఉన్న మంత్రం. దీనిని భారతదేశంలో పూజలో హారతి తర్వాత పఠిస్తూ ఉంటారట!!. నీవార ధాన్యపు మొనలా అణు ప్రమాణంలో ఆత్మ హృదయ పీఠంలో ఉంది అని అర్థమట. ఇక్కడ వాడిన మాట “అణు.”

తర్వాత ప్రాచీన భారతదేశంలో “కణాదుడు” అణుసిద్ధాంతాన్ని ప్రతిపాదించేడట.

ఆయన ప్రపంచంలోని వస్తువులన్నీ “అణువు”ల సముదాయం అన్నారు. ఆయన “అణువు” అన్న మాటనే వాడినా.. నిజానికి అతను “అణువు” అంటూ పిలచింది ఈనాటి atom ని..ఎందుకంటే మోలిక్యూల్ గూర్చి కూడా చెప్పాడతను.

ఆ తర్వాత ఆచార్య నాగార్జునుడు..
ఇతడు రసాయన శాస్త్రంలో అనేక పరిశోధనలు చేశాడట!

ప్రపంచంలో పాదరసం వాడకాన్ని మొదటి సారిగా ప్రయోగించాడట!

బట్టీ పట్టటం (డిష్టిలేషన్ )..శుద్ధిచేయటం (సబ్లిమేషన్ )..భస్మం చేయటం (కాల్సినేషన్ )మొదలైన పద్ధతుల్లో లోహాలపరిశోధనలు చేశాడట!

…అతను రాసిన గ్రంథాలు,పరిశోధనలు చదువుతూ
నాగార్జునుడు పాదరసంతో బంగారం తయ్యారుచేశాడని చదివాను!

పాదరసం అంటే ఏంటి?అని చూస్తే మెర్క్యూరి అని ఉంది. పిరియాడిక్ టేబుల్ (మూలకాల ఆవర్తన పట్టిక) ముందర వేసుకున్నాను.

ఈ పాదరసానికీ..బంగారానికి మధ్య ఒకే ఒక ఎలక్రాన్,ప్రోటాన్ తేడా ఉంది. అతడు తన ప్రయోగాల ద్వారా ఆ తేడా తొలగించి పాదరసాన్ని బంగారంగా మార్చాడు..

నిజంగా ఎంత గొప్ప ఆలోచన..నేను భవిష్యత్తులో ఈ విషయంపై రీసెర్జ్ చెయ్యాలనుకున్నాను!

ఆ పిరియాడిక్ టేబుల్ చూస్తున్నప్పుడే మెరుపులా విరించి రాసిన ప్రేమలేఖలోని లాజిక్ నా మెదడుకు తట్టింది!

వెంటనే మళ్ళీ ఆ ప్రేమలేఖ ముందువేసుకున్నాను!

డియర్ “సల్ఫర్, అమెరీషియం, హైడ్రోజన్,అయోడిన్,టాంటాలం” మిశ్రమమా!!

అని వుంది.. ఆ మూలకాల రసాయన సాంకేత నామాలను రాశాను

సల్ఫర్..S
అమెరీషియం..AM
హైడ్రోజన్..H
అయోడిన్..I
టాంటాలం..Ta

నా పెదవులపై నవ్వు ఉదయించింది..ఎంత సంతోషం వేసిందో చెప్పలేను..చాలా చిన్న లాజికే!! కానీ..అర్థం చేసుకోవడానికి ఇంత సమయం పట్టింది.

ఆ సాంకేత నామాలను ప్రక్క ప్రక్కనే రాస్తే..

డియర్ SAMHITa(సంహితా!).. అంటూ ఆ ప్రేమలేఖలో సంబోధించాడు!

అతని ఐడియాకి ముచ్చటేసింది!..
ఆ ప్రేమలేఖ రాయడంలో అతని ఆలోచన అర్థంఅయ్యాక అతనిలోని క్రియేటివిటీ, జీనియస్ అర్థమయ్యాయాయి!

తర్వాత లైన్..

నీలోని “కాపర్, టెలిరియం మిశ్రమాన్ని” చూసి ఎప్పుడూ కెమిస్ట్రీ రీసర్జ్ పిచ్చిలోనే ఉండే నా మనస్సు చలించిపోయింది!!

రసాయన సాంకేత నామాలను చూశాను

కాపర్..Cu
టెలిరియం..Te

.. నీలోని క్యూట్(అందాన్ని,ఆకర్షణను) ను చూసి ఎప్పుడూ కెమిస్ట్రీ రీసర్జ్ పిచ్చిలోనే ఉండే నా మనస్సు చలించిపోయింది!!..అని అర్థం ఆ మాటకి!

“అతడు నా అందాన్ని పొగడడం నాకిష్టమే!..కానీ,అంతకన్నా ఎక్కువ నాలో ఉన్న విషయాలు చూసినప్పుడే నాకు తృప్తి”..అనుకుంటూ
తర్వాత ఏం రాశాడో చూశాను

కేవలం అదొక్కటే కాదు సుమా!

నీలో “టంగ్ స్టన్-తిరిగిపోయిన టైటానియం మిశ్రమాన్ని” కూడా చూశాను.. చూశాక నా మనసు పరవశించిపోయింది!

మళ్ళీ రసాయన సాంకేత నామాలను చూస్తే..

టంగ్ స్టన్..W
టైటానియం..Ti
“తిరిగిపోయిన టైటానియం”.. అన్నాడు..అంటే iT

..Wit ను చూశాడు నాలో!!

ఇంగ్లీష్ లో Wit అంటే మెంటల్ షార్ప్ నెస్..తెలివి..తొందరగా అవగాహన చేసుకునే శక్తి..అంతేకాదు, సెన్సాఫ్ హ్యూమర్ తో హాస్యంగా మాట్లాడుతూ ఎప్పుడూ ఆనందంగా వుండే స్వభావం.

ఒకేఒక చిన్నమాటలో నన్ను ఆవిష్కరించాడు!
నా మనస్సు సంతోషంతో ఎగిరెగిరి పడసాగింది!…

నన్ను ప్రేమించేవ్యక్తి నా శరీరానికి ఉన్న అందం కన్నా..నాలోకి తొంగి చూసి మనసుకున్న అందాన్ని చూడాలనుకుంటాను!

అలా నాలో గొప్పగా ఉన్నాయని నాకు నేను భావించే గుణాలను విరించి గమనించాడు..అందుకే ఆ సంతోషం!!

…………ఇలా మిగతా మొత్తం ప్రేమలేఖ అర్థం అయ్యింది..ఒకేఒక్క ప్రేమలేఖతో తనని తాను ఎంత బాగా అర్థమయ్యేలా చేసుకున్నాడు..
అంతే కాదు,నేను ఉట్టిసరుకునా?..గట్టి సరుకునా?? అనేది కూడా చూశాడు!

విరించిని ఎలాగైనా వదులుకోవద్దనిపించింది!

మరి నేను మోస్తున్న భావం సంగతి? 15 సంవత్సరాల వయస్సు నుండి పెట్టుకున్న నా నిగ్రహపరీక్ష నియమం సంగతి?????

మనస్సులో ఒక సంఘర్షణ…ఏం నిర్ణయం తీసుకోవాలి అని!!!
కాలమే నిర్ణయించాలి మరి!!!!

**********************

ఈరోజు నేను చేయవలసిన చివరిపని నాలుగవది.. “థామస్ మేడమ్ -డేవిడ్ సార్” వాళ్ళ అబ్బాయి పుట్టినరోజు పార్టీకి అటెండ్ కావడం!

ఆ పార్టీకి విరించి కూడా తప్పకుండా వస్తాడు!
అప్పుడు ఇవ్వడానికి రిప్లై లెటర్ మొదట అందంగా..అతడు రాసినట్లే రాద్దామనుకున్నాను! ఇంకా నా నిగ్రహపరిక్ష పూర్తికాలేదు..అదీగాక నేను పార్టీకి వెళ్లే సమయం దగ్గరపడింది!

చివరకు సింపుల్ గా ఇలా రాశాను.
అతను రాసిన ప్రేమలేఖ నాకర్థమయ్యిందని చెప్పడానికి అన్నట్లుగా!!

విరించిగారూ!
మీరు నా జీవితంలో..
“హైడ్రోజన్, ఎర్భియం,ఆక్సిజన్”మిశ్రమం కావాలంటే ఒకసారి మాట్లాడుకోవాలి మనం!!

రసాయన సాంకేత నామాల ప్రకారం ఆ మిశ్రమం
హైడ్రోజన్ H..ఎర్భియం Er..ఆక్సిజన్ O… అంటే HERO(హీరో) అవుతుంది.

నిత్య, నేను మరికొందరు ఫ్రెండ్స్ అందరం కలిసి ఆ పార్టీకి వెళ్ళాము!
విరించి అప్పటికే వచ్చాడు!
మమ్మల్ని చూడగానే దగ్గరకు వచ్చి నవ్వుతూ విష్ చేసి వెళ్ళాడు..

అతడు నాకు షేక్ హ్యాండ్ ఇచ్చేటప్పుడు ప్రక్కనే ఉన్న నిత్య నన్ను గిల్లింది..అతడు వెళ్ళాక ” ఆ లవ్ లెటర్ అర్థమైందా?రిప్లై తెచ్చావా ??”..అంటూ గుసగుసగా అడిగింది చెవిలో..

నేను తలూపాను!

“ఒప్పుకో!మంచోడు!!..నాకే గనుక ప్రపోజ్ చేసుంటే ఎగిరిగంతేసేదాన్ని!!”..అంది

“చూద్దాం!” అన్నాను ముక్తసరిగా!!

డిన్నర్ చేయకుండా నిమ్మరసం పిండుకుని పల్చటి మజ్జిగ మాత్రమే తాగుతున్న నన్ను చూసి…

“మీరు డిన్నర్ చేయడం లేదేంటి?”..అంటూ అడిగాడు విరించి.. నా దగ్గరకు వస్తూ..

“ఈ మధ్యే కాస్తా వెయిట్ పెరిగానండీ! తగ్గించుకుందామని నిన్నటినుంచి ఒక పదిరోజుల వరకు “వీరమాచినేని డైట్ “ఫాలో అవుతున్నాను..
వచ్చేటప్పుడే నా స్పెషల్ ఫుడ్ తీసుకునే వచ్చాను.”..అంటూ బదులిచ్చాను.

“వెయిట్ పెరిగారా? నాకైతే సరిగ్గా..అందంగా కనిపిస్తున్నారు!” అన్నాడతను.

“హైట్ కి తగ్గ వెయిట్ ఉండేలా చూసుకుంటాను! అందుకే!!” అన్నాను కాస్తా సిగ్గుపడుతూ..

తర్వాత అతనికి నేను తెచ్చిన”రిప్లై లెటర్” ఇచ్చాను.
నా ముందే అది చదివి “ఎప్పుడు కలిసి మాట్లాడుకుందాం!”అన్నాడు చిరునవ్వుతో..

“వచ్చే ఆదివారం”..అంటూ బదులిచ్చాను.

“ఎక్కడ?”అడిగాడు విరించి.

“వెంకటేశ్వర టెంపుల్”

***********************

వచ్చేటప్పుడు నిత్యతో “విరించి గురించి తెలుసుకోవే!..అతనికి ఏమైనా దురలవాట్లు ఉన్నాయా? ..ఇంకా మిగతా విషయాలు కూడా!!”అన్నాను.

“సరే!తప్పకుండా తెలుసుకుంటాను!”..అంది.
దానికి ఇలా అందరి విషయాలు తెలుకోవడం బాగా ఆసక్తి కూడా!!

ఒక రెండు రోజుల్లోనే చెప్పేసింది అతడి వివరాలన్నీ!

దురలవాట్ల గూర్చి చెబుతూ..

“సంహితా! నేను తెలుసుకున్న దాన్ని బట్టి అతనికి పెద్దగా దురలవాట్లు లేవు..రోజూ 4,5 సిగరెట్లు మాత్రం తాగుతాడట!..
కాకపోతే చాలా జీనియసే కాదు..సిన్సియర్ కూడా!అందరిలో తొందరగా కలిసిపోతాడు! నవ్వుతూ..నవ్విస్తూ మాట్లాడతాడు!..ఇంకా ఇండియాలో వాళ్ళు మీ ఊరి ప్రాంతంలోనే ఉంటారట!ఇంకా చాలా ప్లస్ పాయింట్స్ ఉన్నాయి అతనిలో..ఒప్పుకో! ఆ సిగరెట్ విషయం పెళ్ళైతే మార్చుకోవచ్చు!!”..అంటూ చెప్పింది.

నాక్కావాలసింది దొరికింది.

“సరే చూద్దాంలే!!”..అంటూ ఇంటికి వచ్చేశాము నిత్యానేను.
నిత్య అమ్మానాన్నలు అమెరికాలోనే వేరే స్టేట్ లో ఉంటారు.అది నాతో పాటే వుంటోంది.. సెలవులు ఉన్నప్పుడు మాత్రం వాళ్ళింటికి వెళ్లివస్తూ ఉంటుంది.

0 0 votes
Article Rating

Categorized in: